బద్ధ శత్రువులను కూడా క్షమించగలిగిన కరుణాసాగరుడు శ్రీరాముడు -- బ్రహ్మశ్రీ డాక్టర్ కోటేశ్వరరావు.

శత్రువులను కూడా క్షమించగలిగిన కరుణాసముద్రుడు శ్రీరాముడని, శ్రీరాముడు, సుగ్రీవుల ప్రవర్తన మిత్రులు ఎలా ఉండాలో మనకు నేర్పిస్తుందని బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వర రావు ప్రవచించారు. విశాఖపట్నం కొమ్మాదిలో జరుగుతున్న సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనములలో భాగముగా యుద్ధకాండలో జరిగిన రాయబారము, రామరావణ యుద్ధ ప్రారంభ ఘట్టములను గూర్చి వారు వివరించారు. శుక సారణలు అనే రాక్షసులను శ్రీరాముని, వానరుల బలగమును, తెలుసుకోమని రావణాసురుడు పంపించగా వారు వానరుల వేషములలో వానర సైన్యములో చేరుట, విభీషణుడు వాళ్లను గుర్తుపట్టి శ్రీరాముని వద్దకు తీసుకు వచ్చుట, వానరులు అందరూ వాళ్ళను సంహరిస్తాము అనగా శ్రీరాముడు దయాసముద్రుడై వాళ్లను క్షమించి వదిలివేయుట, ఆ తరువాత శరభుడు అనే రాక్షసుడు కూడా ఇదే క్రమంలో ప్రవర్తించగా అతడిని కూడా శ్రీరాముడు క్షమించుట వంటి ఘట్టములను గూర్చి శ్రీ చాగంటి వారు ప్రవచించారు. పరమ దూరాడు, క్రూరుడు అయిన రావణాసురుడు శ్రీరాముడు ససైనముగా దక్షిణ తీరమునకు వచ్చిన సంగతిని తెలుసుకొని, తన వద్ద మయోపాయములను బాగుగా ఎరిగిన ఒక రాక్షసుడిచే శ్రీరాముని, శిరస్సును తయారు చేయించి, సీతమ్మ వద్దకు వెళ్లి ముందు రోజు రాత్రి శ్రీరాముడు నిద్రిస్తుండగా ప్రహస్తుడు శ్రీరాముని సంహరించి ఆయన శిరస్సు ఖండించాడని, వానర సైన్య ప్రముఖులను కూడా సంహరించారని, లక్ష్మణుడు పారిపోయాడని ఆవిడకు చెప్పగా సీతమ్మ ఎంతో బాధపడి పరివేదన చెందిన ఘట్టము గూర్చి వారు వివరించారు. రావణాసురునకు ఏదో కబురు రాగా అతడు అంతఃపురములోకి వెళ్లిపోగానే అక్కడ ఉన్న శ్రీరాముని మాయా శిరస్సు అంతర్ధానమైపోవుట, అప్పుడు విభీషణుని భార్య అయిన సరమ ఆకాశమార్గములో నుండి రావణాసురుడు చెప్పినదంతా విన్నానని, అదంతా అబద్ధమేనని, ప్రస్తుతం కూడా యుద్ధభేరీలు మోగుతున్నాయని, తాను వెళ్లి శ్రీరాముడి సైన్యమును, ఆయన చేస్తున్న యుద్ధ సన్నాహములను చూచి వచ్చానని సీతమ్మకు తెలియజేసి ఇకపై సీతమ్మను సూర్య ఉపాసన చేయమని చెప్పిన వైనమును వారు వివరించారు. తల్లి అయిన కైకసి, మాతామహుడైన మాల్యవంతుడు మంచి మాటలు చెప్పినా రావణాసురుడు అవి పట్టించుకోకపోవడం అతడి మూర్ఖత్వమునకు పరాకాష్టయని వారు తెలియజేశారు. శ్రీరాముడు అంగదుని రావణాసురుని వద్దకు రాయబారమునకు పంపిస్తూ సీతమ్మను సమర్పించకపోతే అతడిని ససైన్యముగా సంహరిస్తానని అతడు అతని అంత్యేష్టి కి కావలసిన ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చని తన మాటగా చెప్పి రమ్మని పంపించారని వారు వివరించారు. అంగదుని రాయబారంలో చెప్పిన మంచి మాటలను రావణాసురుడు వినకపోగా అతడిని పట్టమని నలుగురు రాక్షసులను పంపించగా వారు అంగదుని పట్టుకోడానికి ప్రయత్నించినప్పుడు అంగదుడు ఆకాశంలోకి ఎగిరి, వాళ్ళను దులిపివేసి, ఒక ప్రసాదముపై దూకి వెనక్కి వెళ్లిపోయిన ఘట్టమును గూర్చి వారు వివరించారు. రాజ ప్రాసాదముపై దూరములో రావణాసురుడు కనిపించగానే అత్యంత కృధ్ధుడై సుగ్రీవుడు వెంటనే ఒక్క గెంతు గింతి రావణాసురుని వద్దకు వెళ్లి అతనితో ద్వంద్వయుద్ధము ప్రారంభించాడని, రావణాసురుడు మాయోపాయములను ప్రదర్శిస్తున్నాడని తెలిసి తిరిగి వెనక్కి సుగ్రీవుడు వెళ్ళిపోగానే రాముడు ఆయనతో మాట్లాడుతూ అటువంటి సాహసములు ఇంకెప్పుడూ చేయవద్దని, సుగ్రీవునకు ఏదైనా జరగరానిది జరిగితే రావణ సంహారము చేసి, విభీషణునకు పట్టాభిషేకం చేసి భరతనకు కూడా పట్టాభిషేకం చేసి ఆయన ప్రాణములు వదిలేయటానికి సిద్ధపడతాను అని శ్రీరాముడు చెప్పాడని, వెంటనే సుగ్రీవుడు శ్రీరాముని ధర్మపత్నిని అపహరించిన రావణాసురుని చూడగానే ఆగ్రహం ఆపుకోలేకపోయానని చెప్పాడని, వారిరువురి స్నేహం అంత కల్మషం లేని పవిత్రమైనదని శ్రీ చాగంటి వారు అభివర్ణించారు. రామ రావణ యుద్ధములో మొదటిగా ద్వంద్వ యుధ్ధములు ప్రారంభమయ్యాయని, అందులో వానరులు పైచేయి సాధించారని యుద్ధ ప్రారంభ సన్నివేశమును గూర్చి వారు తెలియజేశారు.