విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
భారత్ వికాస్ పరిషత్ వ్యవస్థాపకులు డాక్టర్ సూరజ్ ప్రకాష్ జీ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న నిరంతర సేవా కార్యక్రమాల్లో భాగంగా 6వ రోజు, శ్రీ రాణి రుద్రమదేవి శాఖ మరియు అల్లూరి సీతారామరాజు శాఖ సంయుక్తంగా బక్కన్నపాలెంలోని శృంగేరి శంకర మఠ దేవాలయానికి నిత్య పూజా కార్యక్రమాల కోసం 8 కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని విరాళంగా అందజేశాయి.
ఈ సందర్భంగా దేవాలయ ధర్మకర్తలు, వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసి, రెండు శాఖల ప్రతినిధులను శాలువాలతో సత్కరించి ఆశీర్వదించారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణలో భారత్ వికాస్ పరిషత్ చేస్తున్న సేవలను వారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ రాణి రుద్రమదేవి శాఖ అధ్యక్షురాలు శ్రీమతి టి. సత్య శ్రీ లక్ష్మీ దేవి, సీనియర్ సభ్యురాలు శ్రీమతి రామాదేవి, అల్లూరి సీతారామరాజు శాఖ ఉపాధ్యక్షులు శ్రీ శివకుమార్ రెడ్డి, శ్రీ సోమశేఖర్, దేవాలయ ధర్మకర్త శ్రీ సతీష్, ఆలయ పూజారులు మరియు భక్తులు పాల్గొన్నారు.
సేవ, సంస్కార్, సంస్కృతి అనే భారత్ వికాస్ పరిషత్ ఆశయాలను ఆచరిస్తూ సమాజ సేవతో పాటు భారతీయ ఆధ్యాత్మిక విలువల పరిరక్షణకు సంస్థ నిరంతరం కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు.