భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జిల్లా సమితి ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ కె రహిమాన్ అధ్యక్షతన మంగళవారం విశాఖ ద్వారకానగర్ పౌర గ్రంధాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
నీట్ పేపర్ లీకేజీ, ప్రశ్న రావణ్‌పై అక్రమ కేసులు, సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్షను భగ్నం చేసి అరెస్టు చేయడం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగ విరుద్ధ చర్యలను నిరసిస్తూ పలువురు నాయకులు ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రముఖ ఆర్థికవేత్త, జాతీయ మానవహక్కుల మాజీ సభ్యుడు ఆచార్య కె.ఎస్. చలం మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛపై నిరంతర దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు విద్యార్థులు, యువత ముందుకు వస్తున్నారని, ఇటీవల ఢిల్లీలో విద్యార్థులు, యువకులు పెద్దఎత్తున చేపట్టిన నిరసన కార్యక్రమాలు దేశంలో ఒక కొత్త ప్రజాస్వామిక చైతన్యానికి నాంది పలుకుతున్నాయని అన్నారు. నీట్ పేపర్ లీకేజీతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లడఖ్ ప్రజల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ను తెల్లవారుజామున బలవంతంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. అలాగే సామాజిక కార్యకర్త అభిజిత్ను కూడా అక్రమంగా అరెస్టు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ ఉద్యమాలకు ప్రజలంతా సంఘీభావం ప్రకటించాలని ఆయన పిలుపునిచ్చారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ జె.వి. సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. దీనికి ప్రశ్న రావణ్ కేసు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రశ్నించినందుకే ప్రశ్న రావణ్‌పై ఒకటి కాదు, అనేక పోలీస్ స్టేషన్లలో వరుసగా కేసులు నమోదు చేశారని అన్నారు.
న్యాయస్థానం ఆయా కేసుల్లో బెయిల్ మంజూరు చేసినప్పటికీ, తిరిగి ఆయనపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం ప్రభుత్వ కక్షసాధింపు ధోరణికి నిదర్శనమని విమర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ప్రశ్నించే గొంతులను అణచివేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని అన్నారు.
రాష్ట్రంలో లాకప్ మరణాలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను, రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్కెఎస్వి కుమార్, విశాఖ జిల్లా వైసీపీ సీనియర్ నాయకులు దేముడుబాబు మాస్టారు, సాహిత్య, సామాజిక వేత్త డాక్టరు మాటూరి శ్రీనివాస్,
ఎంసిపిఐ సీనియర్ నాయకుడు ఎంఎన్ పట్నాయక్, సిపిఐఎంఎల్ ప్రజాపోరు జిల్లా కార్యదర్శి కె దేవా, విదసం ఐక్య వేదిక రాష్ట్ర నాయకుడు డాక్టరు బూసి వెంకటరావు, పిఒడబల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి, డి హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జె వి ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ ఎ జె స్టాలిన్ తదితరులు మాట్లాడుతూ తక్షణమే సోనం వాంగ్ చుక్ తోనూ, సిజెపి పార్టీ అభిసిత్ దీప్కేతోనూ చర్చలు జరపాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం పైడిరాజు, జిల్లా సహాయ కార్యదర్సులు కె సత్యనారాయణ, పి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు కె సత్యాంజనేయ, కె వనజాక్షి, ఎం డి బేగం, ఆర్ శ్రీనివాసరావు, ఎన్ నాగభూషణరావు, పలువురు సిపిఐ వామపక్ష పార్టీలు నాయకులు, ప్రజాసంఘాలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.