*క్రెడిట్ దక్కాల్సిన వారికి దక్కాలి.. చరిత్రను మార్చే ప్రయత్నాలు సరికావు : మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)గారు*
*విజయనగరం, జూలై 31:*
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన ద్వారాలు తెరిచే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ అని, ఈ ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకువచ్చిన ఘనత *మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు* ప్రభుత్వానిదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ *విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా అధ్యక్షులు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త* శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు పేర్కొన్నారు.
విజయనగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, *ప్రధానమంత్రి నరేంద్ర మోదీ* చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కావడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హర్షిస్తోందని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడే ప్రతి ప్రాజెక్టును స్వాగతిస్తామని స్పష్టం చేశారు.
అయితే భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో కీలకమైన భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన అన్ని అనుమతులు, జీఎంఆర్ సంస్థతో ఒప్పందాలు, నిర్మాణ పనులకు అవసరమైన ఆర్థిక మద్దతు, మౌలిక సదుపాయాల కల్పన వంటి ప్రతి ప్రధాన ప్రక్రియ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని గుర్తుచేశారు.
విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణను విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా, భూములు కోల్పోయిన 404 కుటుంబాలకు పునరావాసం కల్పించిన ఘనత కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. విమానాశ్రయ పరిసరాల్లో కాంపౌండ్ వాల్, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సదుపాయాలు, నీటి సరఫరా వంటి మౌలిక వసతుల కోసం వందల కోట్ల రూపాయలను కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు.
2023 మే 3న వైఎస్ జగన్మోహన్ రెడ్డి భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసినప్పుడు, 2026 నాటికి విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని ప్రకటించారని, ఆయన చెప్పినట్లుగానే పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు.
2019లో టీడీపీ ప్రభుత్వం చేసిన శంకుస్థాపనకు పరిపాలనా పరంగా ఎలాంటి పురోగతి లేదని, ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిన అధికారిక సమాచారంలో కూడా ఆ అంశం లేకపోవడం గమనార్హమని పేర్కొన్నారు.
నేడు ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే చర్య అని విమర్శించారు. రైతులకు పెండింగ్‌లో ఉన్న పరిహారం కూడా పూర్తిగా చెల్లించకుండా ప్రచారానికే పరిమితమవడం బాధాకరమన్నారు.
విశాఖ నగరం నుంచి భోగాపురం విమానాశ్రయానికి కనెక్టివిటీ కల్పించే రోడ్ల కోసం కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం కేంద్రంతో చర్చించి నిధులు సమకూర్చిందని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఆ పనులను వేగవంతం చేయలేదని విమర్శించారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర ప్రజల కల. ఆ కలను సాకారం చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదే. చరిత్రను వక్రీకరించి క్రెడిట్‌ను మార్చే ప్రయత్నాలు ఎంత చేసినా ప్రజలకు వాస్తవాలు తెలుసని చిన్న శ్రీను గారు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న దూరదృష్టి, చిత్తశుద్ధి వల్లే ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సాకారమయ్యాయని, ప్రజల మద్దతు కూడా అందుకు నిదర్శనమని అన్నారు.
ఈ కార్యక్రమంలో..
వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి కెవి సూర్యనారాయణ రాజు గారు, నెక్కల నాయుడు బాబు గారు, జిల్లా కార్యదర్శి ఇప్పిలి అనంతగారు, నరసింహ మూర్తి గారు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు జైహింద్ కుమార్ గారు, పద్మనాభం ఎంపీపీ కంటుబోతు రాంబాబు గారు పాల్గొన్నారు.