జనసేన అభ్యర్థి (అర్జల) దేవర మహేశ్వరి విజయం కోసం సమష్టిగా కృషి చేద్దాం
భీమిలి జనసేన ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్.
ఉధృతంగా గాజు గ్లాసు ఇంటింటి ప్రచారం.
మధురవాడ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను మధురవాడ )
జీవీఎంసీ పరిధిలోని నూతనంగా ఏర్పడిన 7వ వార్డు సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి శ్రేణులు ప్రచారంలో జోరు పెంచాయి.7వ వార్డులో కూటమి మద్దతుతో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థి (అర్జల)దేవర మహేశ్వరి (దేవర శివ భార్య) ని అఖండ మెజారిటీతో గెలిపించడానికి నాయకులు,కార్యకర్తలు ఐక్యంగా,సమష్టిగా కృషి చేయాలని భీమిలి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్, టీడీపీ సీనియర్ నాయకులు మొల్లి లక్ష్మణరావు పిలుపునిచ్చారు.ఆదివారం వార్డు పరిధిలోని శివశక్తినగర్ రోడ్డు, స్వయంకృషినగర్, ముత్యాలమ్మ కాలనీ, వివేకానందనగర్,అయ్యప్ప నగర్,వికలాంగుల కాలనీ తదితర ప్రాంతాలలో కూటమి నాయకులు, కార్యకర్తలు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ..వార్డు ప్రగతి కూటమి అభ్యర్థి విజయంతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.ప్రచారంలో పాల్గొన్న నాయకులకు స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.సామాన్య కుటుంబం నుంచి వచ్చి,టీ షాప్లో కష్టపడి పని చేస్తూ స్వయంకృషితో ఎదిగిన దేవర శివ నిజమైన ప్రజా నాయకుడికి నిదర్శనమని స్థానికులు కొనియాడారు.రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో కూడా ప్రజల పట్ల,సమాజం పట్ల ఆయన చూపించిన సేవా గుణం,నిబద్ధత జనసేన అధినేత,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టిలో ప్రత్యేకంగా నిలబెట్టాయని గుర్తుచేశారు.హంగూ ఆర్భాటాలు లేకుండా, ప్రతిరోజూ సామాన్యుల కష్టసుఖాలను దగ్గరుండి చూస్తూ స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న దేవర శివ కష్టాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ ఆయన భార్య మహేశ్వరిని కార్పొరేటర్ అభ్యర్థిగా ఎంపిక చేసి సామాన్యులకు రాజకీయాల్లో పెద్దపీట వేశారన్నారు.ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే మనస్తత్వం ఉన్న దేవర శివ కుటుంబానికి అధికారం వస్తే వార్డు అభివృద్ధితో పాటు స్థానిక సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందని,భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత వార్డు ప్రజలపై ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మొల్లి లక్ష్మణరావు,నమ్మి శ్రీను, ఈగల రవి,జనసేన,టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.