రామ నామము సంజీవని లాంటిది. రామ నామాన్ని జపిస్తే చనిపోయిన వారిని కూడా బ్రతికించే భగవంతుడు శ్రీరామచంద్రుడు. అద్భుతమైన ప్రవచనాన్ని అందించిన మహానుభావుడు ప్రవచన కర్త డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు..
February 27, 2025
విశాఖపట్నం,(ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను పాత మధురవాడ మెట్ట )
చనిపోతున్న వారిని కూడా బ్రతికించగలిగిన మృతసంజీవని శ్రీరామ, నామ
మని, ఎంత పెద్ద తప్పు చేసిన వారినైనా తప్పు తెలుసుకొని తన వద్ద శరణాగతి చేస్తే శ్రీరాముడు కాపాడతారని, శ్రీరాముడిని భౌతికముగానే కాక ఆయన గుణగణములను కూడా పూర్తిగా ఉపాసన చేసిన మహానుభావుడు స్వామి హనునయని, అంత గొప్ప బలపరాక్రమములు కలిగినప్పటికీ హనుమతో సమానమైన వినయము కలిగిన వారు మరెవ్వరూ కనపడాలని బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచించారు. విశాఖపట్నంలో జరుగుతున్న సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనములలో భాగముగా సుందరకాండలో మరొక సిద్ధి సర్గగా చెప్పబడే సీతమ్మ హనుమను దర్శనం చేసిన ఘట్టమును, తదుపరి సీతమ్మకు హనుమ అభిజ్ఞానమును ఇచ్చిన ఘట్టమును గూర్చి వారు మహాద్భుతమైన ప్రవచనమును చేశారు.
సీతమ్మ గుణగణములను చూసి ఆనంద పరవశులై స్వామి హనుమ పా మాట్లాడకుండా ఉండిపోవుట, సీతమ్మకు తాను అనుకున్నట్లుగా జీవించటానికి కానీ మరణిద్దాం అనుకుంటే మరణించడానికి కానీ రావణాసురుడు ఏ విధమైన సహాయము చేయకపోవుటయే అతడి యొక్క రాక్షసత్వమునకు పరాకాష్టయని, తాను అనుభవిస్తున్న ఘోరమైన బాధను తాళలేక సీతమ్మ మరణించడానికి సిద్ధపడగా అది మాయామానుష స్వరూపిణి అయిన ఆవిడ స్వామి హనుమను మాట్లాడటానికి ప్రేరేపించిన ఒక మిషయని, మరి ఏ సాధనము లేక పొడవాటి తన జడను ఉరితాడుగా మార్చి సీతమ్మ మరణించటానికి ప్రయత్నించినప్పుడు మరి ఏ దారి లేక హనుమ శ్రీరామ కథను చెప్పగా సీతమ్మ తాను మరణిద్దాం అనుకున్నా ఊహను కూడా విడనాడుట, శ్రీరామాయణంలో ఎన్నోసార్లు రామ కథ ఎందరినో మృత్యువు నుంచి బయటకు తీసుకు వచ్చుట వంటి అనేక ఘట్టములను గూర్చి శ్రీ చాగంటి వారు వివరించారు. సీతమ్మ స్వామి హనుమను దర్శనము చేసిన ఘట్టమును కూడా సుందరకాండలో సిద్ధిసర్గ అంటారని, పరమ పవిత్రమైన ఆ ఘట్టంలో సీతమ్మ హనుమకు మంగళము కలగాలి అని దేవేంద్రునితో కూడియున్న బృహస్పతిని, బ్రహ్మ గారిని, అగ్ని దేవుడిని ప్రార్థించిందని వారు వివరించారు.
అప్పుడు సీతమ్మకు, హనుమకు మధ్య జరిగిన సంభాషణను గూర్చి వారు ఎంతో గొప్పగా వివరించారు. సీతమ్మ శ్రీరాముని గురించి చెప్పమని అడగగా భౌతికముగా శ్రీరాముడిని అంగ ప్రత్యంగములతో పూర్తిగా వివరించిన హనుమ కేవలం భౌతికముగానే కాకుండా శ్రీరాముని గుణగణములన్నీ కూడా ఎంతో గొప్పగా వివరించారని, శ్రీరాముడిని పూర్తిగా ఉపాసన చేసిన మహానుభావుడు స్వామి హనుమయని వారు అభివర్ణించారు. శ్రీరాముడు పంపించిన అభిజ్ఞానమైన అంగుళీయకమును స్వామి హనుమ సీతమ్మకు ఇచ్చిన ఘట్టము పరమ పావనమైనదని, అప్పుడు సీతమ్మ ఆ కరవిభుషణమును తీసుకొని సాక్షాత్తుగా శ్రీరామచంద్రుడే వచ్చినంత సంతోషపడి, సిగ్గు పడిందని వారు వివరించారు. రాజముద్రిక అయిన ఆ అంగుళీయకము సీతమ్మ వద్దకు చేరుట సాక్షాత్తు శ్రీరామచంద్రుడే వచ్చినట్లు అని, అందుచేత ఇక రావణ సంహారము జరగబోతుందని మంగళకరమైన ఘట్టం ఇది అని వారు అభివర్ణించారు.
సిద్ధిసర్గ మరియు సీతమ్మకు హనుమ అంగుళీయకమును ఇచ్చిన పరమ పావనమైన సర్గ నడిచిన కారణము చేత ఈరోజు ఉపన్యాసములో ప్రత్యేకంగా సీతా రామ హనుమలకు నైవేద్యము, ప్రత్యేక మంగళహారతులు సమర్పించారు.