దిగ్విజయంగా ముగిసిన 42 రోజులు సంపూర్ణ వాల్మీకి రామాయణం, ప్రశాంతంగా సాగిన రామాయణం, బ్రహ్మశ్రీ చాగంటి ప్రవచనాలు వినేందుకు పాల్గొన్న వేలాది మంది భక్తులు. ప్రతిరోజు కిక్కిరిసిన గాయత్రి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం.🙏🏾🌹 సూర్యచంద్రులు ఉన్నంతకాలం రామాయణం ఈ వేద భూమిపై ఉంటుంది.- చాగంటి.-

మధురవాడ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను) శ్రీరామాయణము అత్యంత ఆర్షము, శక్తివంతము, ప్రయోజనదాయకమైన కావ్యమని, శ్రీరామ కథ మధురాతి మధురమైనదని, రామాయణమును చదివినా, విన్నా, చెప్పినా దేవతలు, పితృదేవతలు కూడా సంతోషిస్తారని, సూర్యచంద్రులు ఉన్నంతకాలం భూమిపై రామాయణం ఉంటుందని, రామాయణము చెప్పబడినంత కాలం ధర్మము నిలబడుతుందని, రామాయణము, శక్తిచే తీరని కోరికలు ఏమీ లేదని పూజ గురుదేవులు "ప్రవచన సార్వభౌమ" "వాచస్పతి" బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచించారు. విశాఖపట్నం కొమ్మాది లోని గాయత్రీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో 42 రోజుల నుండి జరుగుతున్న సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనములు శుక్రవారంతో సమాప్తమైనవి. రావణ వధ అనంతరం అయోధ్యకు బయలుదేరుదాము అనుకున్న శ్రీరామునితో విభీషణుడు కొంతకాలం లంకారాజ్యంలో ఉండి తన ఆతిథ్యమును స్వీకరించమని అడిగాడని, అయోధ్యలోని భరతుడు వేచి ఉన్న కారణముచే త్వరగా అయోధ్యకు వెళ్ళిపోవాలని శ్రీరాముడు చెప్పగా శ్రీరామ పట్టాభిషేకమును చూచుటకై తాము కూడా వస్తామని విభీషణ సుగ్రీవాదులతో పాటు వానరులందరూ అడగారని, అందుకు సమ్మతించి శ్రీరాముడు సీతా సమేతముగా వారందరితోపాటు బయలుదేరాడని, మార్గమధ్యంలో భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఆగి ఆయన ఆశీర్వచనమును తీసుకున్న శ్రీరాముడు హనుమతో ముందుగా నందిగ్రామమునకు వెళ్లి భరతుని పరిశీలించి, ఆయనకు ఏమాత్రం అయినా రాజ్యముపై కాంక్ష ఉంటే వెంటనే తనకు నివేదించమని, తాను అరణ్యములలోనే ఉండిపోతానని చెప్పటం శ్రీరాముని యొక్క త్యాగబుద్ధికి, భ్రాతృ ప్రేమకు నిదర్శనమని శ్రీ చాగంటి వారు ప్రవచించారు. నందిగ్రామమునకు చేరుకున్న సీతారాములను చూసి అయోధ్యలోని ప్రజలందరూ ఎంతో సంతోష పడ్డారని, శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేకము అంగరంగ వైభవంగా జరిగిందని, వానరవీరులందరూ అన్ని దిక్కులకు వెళ్లి 500 నదులు మరియు నాలుగు సముద్రముల నుండి సేకరించిన జలములతో శ్రీరామచంద్రుని అభిషేకించి ఇక్ష్వాకు వంశ ప్రభువులు ధరించిన స్వర్ణ మకూటమును శ్రీరామచంద్రునికి విశిష్ట మహర్షి అలంకరించారని, భరతుడు యువరాజుగా పట్టాభిషిక్తుడయ్యాడని వారు శ్రీరామ పట్టాభిషేక ఘట్టమును గూర్చి వివరించారు. శ్రీరాముని పట్టాభిషేకమునకు దేవేంద్రుడు ప్రత్యేకమైన సువర్ణ కమలముల మాలను పంపించాడని, పట్టాభిషేక సమయములో వానర వీరులందరినీ, స్నేహితులైన సుగ్రీవుడిని, విభీషణుని శ్రీరాముడు ఎంతో గొప్పగా సత్కరించారని, సీతమ్మ శ్రీరాముని అనుమతితో హనుమను తెల్లని వస్త్రములు మరియు ముత్యాల హారములతో సత్కరించిందని, నాటికి నేటికి శ్రీరామ రాజ్యము అంత గొప్పగా కీర్తింపబడుతుందని శ్రీరాముడు రాజ్యము చేసిన కాలములో ఎటువంటి అమంగళములు జరగలేదని, ప్రజలందరూ "రామా రామా" అన్న మాట ఏ మాట్లాడుతూ ఎంతో సంతోషముగా గడిపారని, శ్రీరాముడు అనేక యజ్ఞ యాగాదులు చేసి ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలించాడని శ్రీ చాగంటి వారు శ్రీరామ రాజ్యమును గూర్చి ఎంతో గొప్పగా అభివర్ణించారు. శ్రీరామాయణమునకు వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెబుతూ ఈ రామాయణము అత్యంత ఆప్షమైన కావ్యమని, మధురాతి మధురమైన రామ కథయని, రామాయణము ఎక్కడెక్కడ చెప్పబడుతుందో, వినపడుతుందో, చదవబడుతుందో అక్కడ సమస్త పాపములు నశించి దేవతలు, పితృదేవతలు కూడా సంతోషించి సమస్త ఈప్సితములను నెరవేరుస్తారని, రామాయణము చెప్పబడినంత కాలము భూమిలో ధర్మము నిలబడుతుందని, సూర్యచంద్రాదులు ఉన్నంతకాలం రామాయణము ఉంటుందని చెప్పారని, రామకథ వైభవమును, రామాయణము, గొప్పతనమును శ్రీ చాగంటి వారు ఎంతో గొప్పగా కీర్తించారు.