ఆత్మీయుడిని మరిచిపోలేని విశాలాంధ్ర వర్మ సత్తన్న జయంతి సందర్భంగా సీతమ్మధార పాపా హోంలో చిన్నారులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు. సత్తన్న జయంతి సందర్భంగా ఆనాటి మిత్రులందరికీ గుర్తు చేస్తున్న సత్య అన్న. విశాఖలో అందరికన్నా ముందుగా విశాలాంధ్ర క్యాలెండర్ ఆవిష్కరించే సత్య అన్న. జ్ఞాపకాలు నెమరు వేస్తున్న డాక్టర్ విశాలాంధ్ర వర్మ.,
May 12, 2026
విశాఖ సిటీ,ప్రజాబలం న్యూస్ ఆన్లైన్( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
✍️*సత్య తో సాన్నిహిత్యం మరువలేను* ఆత్మీయుడు, స్నేహశీలి, సహచర సీనియర్ జర్నలిస్టు శ్రీ నూతపల్లి సత్యనారాయణ (సత్య) జయంతి సందర్భంగా నేడు ఆయనతో ఉన్న జ్ఞాపకాలు మరింతగా నా మదిలో మెదిలాయి. దాదాపు 15 ఏళ్లుగా మా ఇద్దరి మధ్య నెలకొన్న ఆత్మీయ బంధం మరువలేనిది. నేను విశాలాంధ్ర దినపత్రికలో బ్యూరో చీఫ్ గా ఉండగా ఆయన ప్రస్తుతం విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంగా ఉన్న ప్రాంతంలో జర్నలిస్టుగా పనిచేసేవారు. నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరు సత్య. శ్రీ నూతపల్లి సత్యనారాయణ గారిని నేను ఎప్పుడూ అభిమానంగా సత్య అని పిలిచేవాడిని. ప్రతిరోజూ... సత్య.. సత్య.. సత్య అని పదే పదే పలికేవాడిని. సత్య తో ఒక్కరోజు మాట్లాడకపోతే ఏదో వెలితిగా ఉండేది. మంచి మనసు, విలువలతో కూడిన జీవితం సత్య.. సొంతం. కుటుంబ పరంగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే..మరో పక్క సామాజిక సేవల్లో పాల్గొనేవారు. విశాలాంధ్రలో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ అంకితభావంతో పనిచేసేవారు. ఏ పని చెప్పినా శ్రద్ధతో కృషిచేసి ఫలితాలు రాబట్టేవారు. ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ (యూజేఎఫ్) లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 114 మండలాలను యూజేఎఫ్ బృందం పర్యటించినప్పుడు సత్య ప్రతిరోజు..నా వెంటే ఉన్నారు. యూజేఎఫ్ బృందం ప్రజలు స్థితిగతులు తెలుసుకునేందుకు కొండలు, గుట్టలు, శివారు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నాకు వెన్నుదన్నుగా నిలిచారు. నాటి యూజేఎఫ్ పర్యటన దిగ్విజయంగా ముగిసిన నేపథ్యంలో సత్య..తన నివాస ప్రాంతమైన గోపాలపట్నంలో ముగింపు కార్యక్రమాన్ని అన్నీ తానై నిర్వహించి అందరి మన్ననలు పొందారు. ఉత్తరాంధ్ర సమస్యలపై దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ప్రముఖులకు అధ్యయన నివేదికలను అందజేసిన సందర్భంలో సత్య చేసిన కృషిని నేను మరువలేను. ఇలా చెప్పుకుంటే పోతే సత్య తో జ్ఞాపకాలు.. ఎన్నో..మరెన్నో. అలా ప్రతి సందర్భంలోనూ నా వెంట ఉండే సత్య.. కరోనా సమయంలో భౌతికంగా దూరం కావటం.. నా జీవన గమనంలో ఉప్పెన వచ్చినట్లయ్యింది. నా సత్య ఇక లేరన్న నిజాన్ని దిగమింగుకోవడం చాలా కష్టమైంది. సత్య ఆలోచనలు.. ఆశయాలు ఉన్నతమైనవి. స్నేహమంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి. నిస్వార్థ స్నేహానికి నిండు నిదర్శనం సత్య. ఉన్నంత కాలము సంతృప్తికరమైన జీవితాన్ని గడిపారు. నిరంతరం సేవా పథంలో పయనించిన శ్రీ నూతపల్లి సత్యనారాయణ గారి ఆశయానికి అనుగుణంగా ఆయన జయంతి సందర్భంగా ఈరోజు సీతమ్మధార పాపా హోంలో చిన్నారులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసే చిరు కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగింది. సత్య ఆశయ సాధన కోసం భవిష్యత్తులోనూ కృషి చేస్తామని తెలియజేసుకుంటూ.. సత్యకు జోహార్లు.. 👋*ఐ మిస్ యు సత్య* మీ - l🙏l *డాక్టర్ ఎం.ఆర్.ఎన్ వర్మ, అధ్యక్షులు, ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్*

