విశాఖలో ఏ ఐ జి హాస్పిటల్ కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్.

విశాఖలో ఏఐజీ(AIG) హాస్పిటల్స్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన.
 
రూ.2వేల కోట్ల పెట్టుబడి, వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మాణం.
 విశాఖపట్నం (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)


విశాఖపట్నం: ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన ఏఐజీ(AIG) ఆసుపత్రి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు విశాఖ ఆనందపురం మండలం ఎండాడ వద్ద ఏఐజీ హాస్పిటల్స్ నిర్మాణానికి సంస్థ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డితో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ముందుగా ఎండాడ వద్ద వేదిక ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు ఏఐజీ హాస్పిటల్స్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆసుపత్రి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆసుపత్రికి సంబంధించి రూపొందించిన ఏవీని వీక్షించారు.
 
*రూ.2వేల కోట్ల పెట్టుబడి, 9వేల మందికి ఉద్యోగ అవకాశాలు*
 
విశాఖలో నెలకొల్పనున్న ఏఐజీ ఆసుపత్రి ద్వారా సంస్థ దశలవారీగా ఐదేళ్లలో 2వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 9వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. పూర్తిస్థాయి నిర్మాణం పూర్తయ్యే నాటికి ఆసుపత్రి సామర్థ్యం వెయ్యి పడకలకు చేరనుంది. విశాఖలో 9 ఎకరాల్లో ఆసుపత్రి క్యాంపస్, 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయనుంది. ఒకే క్యాంపస్‌లో వైద్య సేవలు, శిక్షణ, పరిశోధన, రోగులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని సదుపాయాలతో కూడిన కంప్లీట్ హెల్త్ కేర్ ఎకోసిస్టమ్‌ను నెలకొల్పనుంది. మొదటి దశ నిర్మాణాలను 650 పడకల సామర్థ్యంతో 2028 అక్టోబర్ నాటికి పూర్తిచేయనున్నారు. రెండో దశ నిర్మాణాలను 350 పడకల సామర్థ్యంతో రెండేళ్లలో పూర్తిచేయనున్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో అందించే పూర్తిస్థాయి వైద్య సేవలను ప్రతిబింబించేలా 8 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో 50కి పైగా వైద్య ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు.
 
ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గణబాబు, ఏఐజీ హాస్పిటల్స్ వైస్ ఛైర్మన్ పీవీఎస్ రాజు, డైరెక్టర్ జీవీ రావు, సీఈవో సామ్ రిజ్వీ, విశాఖ ఏఐజీ హాస్పిటల్స్ విశాఖ డైరెక్టర్ కే.రాకేష్, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, విశాఖ పోలీసు కమిషనర్ డా.శంఖభ్రత బాగ్చీ, ఏఐజీ హాస్పిటల్స్ సీవోవో కాప్రీ జలోట తదితరులు పాల్గొన్నారు.